పోటాపోటీగా వేలం పాడి ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ మంగళవారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రోజైన సోమవారం 40 ప్లాట్లకు సంబంధించిన వేలం పూర్తవగా, మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో మిగతా 40 ప్లాట్లకు ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహించారు.

టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే విశాలమైన రోడ్లు, విద్యుత్‌, నీటి సదుపాయం, డ్రైనేజీలు, ఎస్‌.టీ.పీ వంటి వసతులను కల్పిస్తుండడంతో బిడ్డర్లు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. అన్నింటికీ మించి డీటీసీపీ అప్రూవ్డ్‌ లేఔట్‌ కలిగిన వెంచర్‌ కావడం, ఎలాంటి చిక్కులు లేకుండా ప్రభుత్వమే ప్లాటింగ్‌ చేయడం, నిజామాబాద్‌ నగరానికి చేరువలో ఉండడంతో తమకు నచ్చిన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.

సోమవారం నాటితో పోలిస్తే చివరి రోజైన మంగళవారం ఆయా ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు వేలంలో పోటీ పడ్డారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ప్రారంభ ధర ఎనిమిది వేల రూపాయలుంటే, తొమ్మిది వేల పైచిలుకు ధరకు ప్లాట్లు విక్రయించబడ్డాయి. కొన్ని ప్లాట్లు అయితే చదరపు గజానికి వేలంలో అత్యధికంగా 9500 రూపాయల ధర పాడి ఔత్సాహిక బిడ్డర్లు దక్కించుకున్నారు.

మొదటి రోజు తరహాలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, బిడ్డర్ల నుండి ఈ.ఎం.డీ ధరావత్తు పది వేల రూపాయల డీ.డీ ని స్వీకరిస్తూ, టోకెన్లు, దరఖాస్తు ఫారాలు అందించారు. టోకెన్‌ కలిగిన వారిని వేలంలో పాల్గొనేందుకు అనుమతించారు. ఒక్కో ప్లాట్‌ వారీగా అధికారులు నిబంధనలను అనుసరిస్తూ వేలం ప్రక్రియను నిర్వహించారు. అధిక ధర పాడిన వారికి ప్లాట్‌ ఖరారైనట్లు అధికారులు ప్రకటిస్తూ కేటాయింపు లేఖలు అందజేశారు.

వారం వ్యవధిలో 33శాతం మొత్తాన్ని, 45 రోజుల్లో మరో 33 శాతం రుసుమును, 90 రోజుల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. మొత్తం 80 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించగా, బిడ్డర్లు 20 ప్లాట్లను కొనుగోలు చేశారు.

త్వరలోనే రెండవ విడత వేలం నిర్వహిస్తాం : కలెక్టర్‌

ముందుగా ప్రకటించిన మేరకు ధాత్రి టౌన్‌ షిప్‌ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్టమైన భరోసా కల్పించారు. వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

ధాత్రి టౌన్‌ షిప్‌ను అన్ని అధునాతన వసతులతో మోడల్‌ లేఔట్‌తో కూడిన గేటెడ్‌ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం మొదటి దఫా వేలంలో మిగిలిపోయిన ప్లాట్‌లతో పాటు, లే ఔట్‌ వెంచర్‌ లోని మిగతా 236 ప్లాట్లను సైతం అభివృద్ధి చేసి త్వరలోనే రెండవ విడత ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. వేలం ప్రక్రియలో నిజామాబాద్‌ ఆర్దీఓ రవి, టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్‌ దినేష్‌, తహసీల్దార్లు అనిల్‌, సుదర్శన్‌, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »