కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమ్మర్ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్ 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, జులై 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, అక్టోబర్ 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఈ అవకాశాన్ని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న వారందరిని వంద శాతం నమోదు చేయాలని కోరారు.
బూతు లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. ప్రతి రాజకీయ పార్టీ ఏజెంటును ఏర్పాటు చేసుకొని కొత్త ఓటర్ల నమోదుకు సహకారం అందించాలని చెప్పారు. జనాభాకు అనుగుణంగా ఓటర్ల నమోదు ఉండాలన్నారు. 90 ఏళ్లు నిండిన ఓటర్లను గుర్తించాలని పేర్కొన్నారు.