అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారానా సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌ నగర్‌లో గల ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్‌ బూత్‌ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ఇటీవల ప్రవేశపెట్టిన కీలక, మార్పులు చేర్పుల గురించి వారిని పరిశీలకులు యోగితారానా ప్రశ్నించగా, బీఎల్‌ఓలు స్పష్టమైన సమాధానాలు చెప్పడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బీఎల్‌ఓలకు పరిపూర్ణమైన శిక్షణ అందించారంటూ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటరు జాబితాను అతికించాలని సూచించారు.

అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఆర్దీవోలు, తహసీల్దార్లు, బీఎల్‌ఓలతో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి బీ.ఎల్‌.ఓ లకు చక్కటి శిక్షణ అందించారని, ఎంతో క్లిష్టమైన అంశాలను సైతం వారు సులువుగా ఆకళింపు చేసుకుని సంతృప్తికరంగా పని చేస్తున్నారని పరిశీలకులు యోగితారానా ప్రశంసించారు.

ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారులతో పాటు, బీఆర్‌ఓల పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని పేర్కొన్నారు. ఇప్పటినుండే పక్కా ప్రణాళికతో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను అనుసరిస్తూ కసరత్తు జరిపితే, ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. ఓటరు జాబితాను ముందుగానే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని సూచించారు. ఈ జాబితాను సదరు ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా మార్పులు, చేర్పులను గమనిస్తే అధికారుల దృష్టికి తేవాలన్నారు.

ప్రధానంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ కు కనీసం ఒకరు చొప్పున ఆయా పార్టీల తరఫున ఏజెంట్లను నియమించుకుని, వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లా యంత్రాంగానికి సమర్పించాలన్నారు. దీనివల్ల ఓటరు జాబితాలో ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుంటూ, మార్పులు, చేర్పులను చేపెట్టేందుకు, తద్వారా ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ఉంటుందని పరిశీలకులు యోగితారానా సూచించారు.

ఈ సందర్భంగా ఇటీవల ఎలక్షన్‌ కమిషన్‌ కొత్తగా ప్రవేశపెట్టిన మార్పుల గురించి అవగాహన కల్పించారు. ఇదివరకు ఏడాది కాలంలో కేవలం జనవరిలో మాత్రమే 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల పేర్లను జాబితాలో నమోదు చేసేవారని, ప్రస్తుతం జనవరి తో పాటు ప్రతి త్రైమాసికానికి ఒక పర్యాయం చొప్పున ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ నెలల్లోనూ నమోదు చేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. 2023 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న యువతీయువకుల పేర్లు, వివరాలను ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు.

ఓటరు జాబితాలో ఎవరైనా అనాథలు ఉంటే, వారి సంరక్షకుడి పేరును వివరాల్లో నమోదు చేయాలని, దివ్యాంగులు ఉంటే అలాంటివారి వైకల్యం శాతాన్ని నమోదు చేయాలని సూచించారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లకు సంబంధించి వారి గురువు పేరును ఓటరు వివరాల్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఓటరు కార్డుతో ఆధార్‌ ను అనుసంధానం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.

ఆధార్‌ సీడిరగ్‌ ఐచ్చికం అయినప్పటికీ ప్రతి బూత్‌ పరిధిలో కనీసం 80 శాతం వరకు అనుసంధానం జరిగేలా చూడాలన్నారు. ఓటరు జాబితాలో బోగస్‌ ఓటర్లు, డూప్లికేషన్‌ లకు తావులేకుండా, సర్వీస్‌ ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లందరి ఓటు హక్కు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉండేలా చొరవ చూపాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 2023 ఓటరు జాబితా రూపకల్పన కోసం పెద్ద ఎత్తున కసరత్తులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బీ.ఎల్‌.ఓ లకు అన్ని అంశాలపై పరిపూర్ణమైన శిక్షణ ఇప్పించి ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేయడం, ఆధార్‌తో అనుసంధానం, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పరిశీలకులు యోగితారానా దృష్టికి తెచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శిని బీ. ఎల్‌. ఓ గా బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నామని, అంగన్వాడీ కార్యకర్తలు కూడా బీ.ఎల్‌.ఓ లుగా కొనసాగుతున్నారని వివరించారు.

సమావేశాల్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి శశికళ, డీఆర్డీఓ చందర్‌, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్‌, ఆయా మండలాల తహసీల్దార్లు, ఈ.ఆర్‌.ఓలు, సహాయ ఈ.ఆర్‌.ఓలు, బీ.ఎల్‌.ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »