నిజామాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె మూడవ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై ఓమయ్య, పి.నర్సింగరావు పెన్‌డౌన్ శిబిరానికి వెళ్లి ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ సంఫీుభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగం అంటేనే అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని పండగ, వారాంతపు సెలవుల్లో కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పనిచేస్తుంటారని, అటువంటి వారిపై దాడులు సరికాదన్నారు. అధికారితో సమస్య ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది తప్ప దాడులు చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు.
మూడు రోజులుగా ఉద్యోగులు పెన్‌డౌన్ చేస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటియుసి అండగా ఉంటుందని తెలిపారు.
జిల్లా అధికార యంత్రాంగం రాబోయే కాలంలో ఇటువంటి దాడులు జరగకుండా దాడులు చేసినటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అధికారులకు మనోధైర్యాన్ని భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకుంటే అవసరమైతే మిగతా కార్మికులు కూడా ఆందోళనకు సిద్ధమవుతారని పేర్కొన్నారు.