కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఒకేసారి ప్లాట్, గృహం మొత్తం విలువ చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలకు బుధవారం వేలంపాట నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 44వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో అడ్లూరు శివారులో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాలు మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటు ధరలకే వేలం ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు. బుధవారం నిర్వహించిన వేలంలో ప్లాట్ల ధర రూ.7,100 నుంచి రూ.11,600 వరకు ధరలు పలికినట్లు పేర్కొన్నారు.
బుధవారం 41 ఫ్లాట్లు, 24 గృహాలకు వేలంపాట నిర్వహించినట్లు చెప్పారు. 29 ప్లాట్లు, ఒక గృహం వేలం ద్వారా విక్రయించగా రూ.2.55 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్లాట్లు, గృహాలు దక్కించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జోనల్ మేనేజర్ రాందాస్, అధికారులు పాల్గొన్నారు.