నిజామాబాద్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పి.డి.ఎస్.యు నగర కమిటీ ఆధ్వర్యంలో కాలూర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే. ఆశుర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 1235/1 లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ కాలూరు స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూన్నారని అన్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల విలువచేసే ఎకరం పైగా స్కూలు స్థలాన్ని ఇతరులకు వదిలేసి, గత సంవత్సరం ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేశారన్నారు.
గతంలో పాఠశాల స్థలం కబ్జాకు గురవుతుందని, వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ప్రహరీ గోడ లేదా పెన్సింగ్ వేయాలని కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి, జిల్లా విద్యాధికారికి, ఏడి, ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, నిజామాబాద్‌కి పి.డి.యస్.యు, పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఇదివరకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం ఏ.డి, ల్యాండ్ అండ్ సర్వే వారు పాఠశాల స్థలాన్ని సర్వే చేసి, హద్దులు నిర్ణయించారన్నారు. ఇట్టి ఫైల్ నెంబర్ (ఏ1/2458/2021) అయితే, తాజాగా సర్వే రిపోర్టుకు భిన్నంగా ఈ స్కూలు స్థలాన్ని మళ్లీ కబ్జా చేసి రోడ్డు వేసుకోవాలని పాఠశాల స్థలాన్ని అరఎకరం పైగా ఇతరులకు వదిలేసి గేట్లు బిగించాలని, గ్రామంలోని కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈ విషయమై గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేస్తే వారి ఆదేశానుసారం పోలీసులు వచ్చి పని ఆపివేయించారన్నారు. వెంటనే పాఠశాల స్థలాన్ని కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, గత సంవత్సరం ఏడి సర్వే చేసి హద్దులు నిర్ణయించిన ప్రకారమే ప్రహరీ లేదా ఫెన్సింగ్ వేయించాలని తద్వారా పాఠశాల స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో పి.డి.యస్.యు ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామ ప్రజలతో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి అజయ్, నగర నాయకులు రూపేష్, గోపి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.