కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అర్హత గల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అంతకుముందు ఉపాధి హామీ, వ్యవసాయం, మిషన్ భగీరథ, వైద్యం, విద్య, రోడ్లు, నీటిపారుదల శాఖలపై సమీక్ష నిర్వహించారు. డిఆర్డిఓ సాయన్న మాట్లాడారు.
జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు 39.64 లక్షల పని దినాలు కల్పించామని తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ కల్పన, కూలీల వలస నివారణ, కరువు నివారణ, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులను చేయిస్తున్నామన్నారు. ప్రస్తుతం కూలీలకు దినసరి వేతనం రూ.257 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. హరితహారం పథకంలో20.07 లక్షలు జిల్లా లక్ష్యం. కన్నా అధికంగా ఇప్పటివరకు 27.43 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి మాట్లాడారు. యాసంగిలో రైతులు వరి పంటను సాగు చేసుకోవచ్చని సూచించారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో గ్రామస్థాయిలో సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దిన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.