వర్ని, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్ బాబా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. లక్ష రూపాయల పూర్తి రుణమాఫీ చేసి తక్షణమే రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని యువతకు హామీ ఇచ్చి దాని ఊసే లేదని, మనమందరం పోరాడి కొట్లాడి నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములమయ్యామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఇప్పుడు కెసిఆర్ తన కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగహ్రం వ్యక్తం చేశారు. రైతులను, యువతను మోసం చేస్తున్నారని, తాను చెప్పిన వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. కాబట్టి రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కొరకు, యువకుల కొరకు పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ప్యాట్ల లక్ష్మయ్య, భూమరెడ్డి, పీర్యా, రాములు నాయక్, అమీర్ పాల్గొన్నారు.