కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల యువ సమ్మేళనం స్థానిక రాజారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా అఖిలభారత ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యామ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. నిజాం దౌర్జన్యాలను, రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజానీకం అనుభవించిన కష్టాలను కన్నులకు కట్టినట్లుగా వివరించారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా నిజాం మెడలు వంచి తెలంగాణ సమాజానికి ఒక నియంత అయిన నిజాం నుండి విమోచనం లభించిందన్నారు. 1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు 13 నెలల కాలంలో నిజాం ప్రయివేటు సైన్యం అయిన రజాకారులు ఖాసీం రజ్వీ అధ్యక్షతన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, మహిళలపై క్రూరమైన అకృత్యాలు సాగించారని తెలిపారు.
నిజమైన చరిత్ర అంతా నేటి యువతరానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నేటి యువతరం ఆలోచన, విచక్షణలతో మన దేశ చరిత్ర తెలుసుకొని భావి భవిష్యత్ తరాలకు భారత్ ఆదర్శంగా ఉండేలా మన దేశ పునాదికి బాటలు వేయాలని తెలిపారు.
కార్యక్రమంలో 1700 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. శిశుమందిర్ విద్యార్థుల స్వాగత నృత్యం అందరినీ అలరించింది. సభావేదికపై ఉత్సవ సమితి అధ్యక్షులు అబ్బగౌని ప్రతాప్ గౌడ్, రణజిత్ మోహన్, బొడ్డు శంకర్, గరిపల్ల అంజయ్య, కదిరె లక్ష్మారెడ్డి, మిగతా ప్రతినిధులు పాల్గొన్నారు.