అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు

కామారెడ్డి, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా, బీడీ కార్మికుల, దివ్యాంగుల పింఛన్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను యాసంగిలో రైతులు సాగు చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. పంటల మార్పిడి విధానంపై రైతు వేదికలలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించే విధంగా మండల వ్యవసాయ అధికారులు చూడాలన్నారు.

బీమా ఉన్న రైతుల వివరాలు రైతు వేదికలో జరిగే సమావేశంలో చదివి వినిపించాలని కోరారు. ధరణి సమస్యలను పరిష్కరించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తానని చెప్పారు. పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తులను 100 శాతం పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశాలకు డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులు గైరాజరైతే తనకు లేఖ ద్వారా సమాచారం పంపాలని తెలిపారు. గైరాజరైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అర్హత గల వారికి ఆసరా పింఛన్లు మంజూరయ్యే విధంగా డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశంలో తాను ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్లి చూస్తానని జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే అన్నారు. దళితులందరికీ దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. ఎలాంటి అనుమానాలకు లోను కావద్దన్నారు. ప్రతి నియోజకవర్గానికి త్వరలో 1500 మందికి దళిత బంధు పథకం ద్వారా నిధులు మంజూరవుతాయని చెప్పారు. మూడేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వస్తుందని పేర్కొన్నారు.

రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు అధికంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూశారని కొనియాడారు. నిరుపేద ఆడబిడ్డల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సాయా గౌడ్‌, డి ఆర్డిఓ సాయన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చేపట్టిన తీర్మానాలు
జెడ్‌పిహెచ్‌ఎస్‌ కాచాపూర్‌ ఇంగ్లీష్‌ మీడియం పదవ తరగతి పెంచుటకు, జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ మాల్‌ తుమ్మెద ఇంగ్లీష్‌ మీడియం 9, 10 తరగతులు పెంచుటకు సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గాంధారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో వ్యవసాయం, ఉపాధి హామీ, మార్కెటింగ్‌, ఆర్టీసీ, అటవీ శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌, విద్యాశాఖ, రోడ్లు, నీటిపారుదల, మత్స్య శాఖలపై సమీక్ష నిర్వహించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »