నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని అన్నారు. మాక్లూర్‌ మండలం అడవిమామిడిపల్లి వద్ద అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణంతో పాటు ఆయాచోట్ల ఆర్‌ఓబి నిర్మాణ పనులు మందకొడిగా ఎందుకు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యే కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేయకూడదని సూచించారు.

సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రభుత్వా లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు. ఆయా పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయి, వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, మైనింగ్‌, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. కాగా, ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మధ్యాన్న భోజనానికి బియ్యం కొరత ఏర్పడకుండా ముందస్తుగానే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రొటోకాల్‌ పాటించడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పందిస్తూ, ఇప్పటికే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు వస్తే, బాధ్యులైన అధికారులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే, అధికార యంత్రాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, నిధుల వినియోగం విషయంలో ఎలాంటి తేడా చూపకుండా ఒకే దృక్పథంతో అమలు చేస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. నిధులు కేంద్రం ద్వారా వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి అయినా సరే, అర్హులకు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు మధ్యాన్న భోజనంలో క్రమం తప్పకుండా కోడిగుడ్డుతో పాటు పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సభ్యులు ఆందోళన వెలిబుచ్చగా, పంట ఉత్పత్తులు ఆరబెట్టుకునేందుకు సి.సి ప్లాట్‌ ఫారంల నిర్మాణాలకు గ్రామ పంచాయతీలు ముందుకు వస్తే వాటిని మంజూరు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

సి.సి కళ్ళాల ఏర్పాటుతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను నామినేషన్‌ పధ్ధతిపై ఎవరికి కేటాయించాలనే అధికారం గ్రామ పంచాయతీకే ఉంటుందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధుల్లో అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో వెల్లడైతే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నిధులను రికవరీ చేయాలని డీఆర్డీఓ చందర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

సీనరేజీ నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సభ్యులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »