నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్. సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై డివిజన్‌ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే, పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయని ఏ ఒక్క కేసు కూడా పెండిరగ్‌లో ఉండకూడదని అన్నారు. పీసీఆర్ 1955, పీఓఏ 1989 చట్టాలను ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతూ, బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు.
ఈ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎక్కువగా గ్రామాభివృద్ధి కమిటీల ముసుగులో కొనసాగే ఆగడాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వీడీసీ లపై ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. చిట్టీలు, వ్యాపార లావాదేవీల పేరుతో ప్రజలను మోసం చేసి వారి డబ్బులను ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు.
అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అన్నారు. భూ సమస్యలు, తగాదాలతో ముడిపడి ఉన్న కేసులకు సంబంధించి పోలీసు అధికారులకు కోరిన వెంటనే వివరాలు అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. పెండిరగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ కెఆర్.నాగరాజు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్‌శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్మూర్ డివిజన్‌లో అత్యాచారం కేసులో తాము సమగ్ర సాక్ష్యాధారాలతో ఫైల్ చేసిన చార్జిషీట్ ఆధారంగా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించిందన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, ప్రభాకర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.