కోటగిరి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఇందిరా గాంధీ కుటుంబం స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో ఏడున్నర సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారని, చిన్నతనం నుండి ఇందిరా గాంధీ స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అని, ఇప్పటికీ భారతదేశాన్ని ఇందిరా గాంధీ కంటే ముందు ఇందిర గాంధీ తర్వాత అని ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనుకునే విధంగా సేవలు చేసినటువంటి వ్యక్తి ఇందిరా గాంధీ అన్నారు.
రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టిందని, కూడు, గుడ్డ, ఇల్లు అనే పథకంతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన ఘనత ఇందిరా గాంధీదని, అలీన దేశాల అధ్యక్షురాలిగా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలిపి ఉక్కు మహిళగా పేరుపొందిన వ్యక్తి అని గుర్తుచేశారు.
ఇందిరగాంధీ సేవలు దేశ ప్రజలు గాని జిల్లా ప్రజలు గాని ఎన్నటికీ మరువలేరని మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు నెహ్రూ, ఇందిరా గాంధీ సేవలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయని నెహ్రూ గురించి గానీ, ఇందిరా గాంధీ గురించి గానీ తప్పుగా మాట్లాడితే అది ఆకాశం పై ఉమ్మి వేయడమే అవుతుందని ఇందిర గాంధీ యొక్క ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు గంగాధర్ దేశాయి, పవన్, యంపిటిసి మనోహర్, సాయిలు, వాహిద్, అయ్యుబ్, అబ్బయ్య, బల్రామ్, ఫత బాయ్, రాజు, హనుమాండ్లు, తదితరులు పాల్గొన్నారు.