నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా చేతి గడియారాలను బహుమతిగా పంపించారు.
ఎస్సెస్సిలో 9.5 గ్రేడ్ పాయింట్లకు పైగా సాధించిన నందిపేట మండలం అయిలాపూర్ ఎస్సీ హాస్టల్ కు చెందిన జశ్వంత్, వంశీ, మురళి, దర్పల్లి హాస్టల్ విద్యార్థి సన్నిత్ లకు కమిషనర్ పంపించిన బహుమతుల బాక్స్ ను శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు తమ చేతుల మీదుగా అందజేశారు.
ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందిస్తూ, ఇదే తరహా అకుంఠిత దీక్షతో ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ తదితరులు పాల్గొన్నారు.