నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక కొందరు, సరైన చదువు లేక మరికొందరు, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక సతమతమౌతున్నారని, ఇలాంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)ను అమలు చేస్తుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమ్మయ్య తెలిపారు.
ఉన్నత విద్యావంతులైనా, ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉండి స్వశక్తితో ఉన్నత స్థితికి ఎదగాలనే తపన ఉంటే చాలు ఆర్థిక స్థోమత లేకున్నా ఇండస్ట్రీ పెట్టాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళకు ఈ స్కీం ఒక వరంగా నిలుస్తోందన్నారు. స్వల్ప పెట్టుబడి, బ్యాంక్‌లోన్, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని అనతికాలంలోనే వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. తాము ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా మరికొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు దారి చూపుతోందని, సబ్సిడీలు, బ్యాంక్ లోన్లు పీఎంఈజీపీ కింద తయారి రంగంలో పరిశ్రమలకు రూ.50 లక్షల వరకు, సేవారంగ పరిశ్రమలకు రూ.20 లక్షల వరకు లోన్ లభిస్తుందని తెలిపారు.
బ్యాంకులు 60 నుంచి 75 శాతం టర్మ్ లోన్ల రూపంలో అందించి 11 నుంచి 12 శాతం వడ్డీ రేటు వసూల్ చేస్తాయని తెలిపారు. ప్రిలిమినరీ మారిటోరియం తర్వాత రిపేమెంట్‌కు మూడు నుంచి ఏడు సంవత్సరాల వ్యవధి ఉంటుందని, తీసుకున్న రుణంలో అభ్యర్థుల ప్రాంతాలను బట్టి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందన్నారు. అర్బన్, రూరల్ స్పెషల్ కేటగిరి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండి క్యాఫ్ట్ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు పొందవచ్చని, అర్బన్ జనరల్ కేటగిరిలో 15 శాతం, రూరల్ 25 శాతం, అర్బన్ స్పెషల్ 25 శాతం, రూరల్ స్సెషల్ కేటగిరిలో 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు.
ఇదివరకే స్థాపించి సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తున్న పీఎంఈజీపీ, ముద్ర, ఆర్‌ఈజీపీ పరిశ్రమల విస్తరణ కోసం రెండవసారి ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇందులో తయారీ రంగానికి రూ.కోటి వరకు, సేవా రంగానికి రూ.25 లక్షల వరకు బ్యాంక్ లోన్, ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా అర్హులేనని, దీనికి ఆదాయ పరిమితి లేదని అన్నారు.
రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయం వరకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదని, తయారీ రంగంలో రూ.10 లక్షలు, సేవా రంగంలో రూ.5 లక్షలు పైబడిన వ్యయం కలిగిన ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతి అని జీ.ఎం వివరించారు. లబ్ది పొందాలనుకునే వాళ్ళు జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ లో లేదా కేవీఐసీలో సంప్రదించాలని, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
జిల్లాలో ఎన్నో అవకాశాలు
నిజామాబాద్ జిల్లా పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. జిల్లాలో అగ్రి బేస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్, కన్ స్ట్రక్షన్, సింగరేణి అనుబంధ పరిశ్రమలను స్థాపించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీయిల్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. కాటన్ జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్స్ అనుబంధ పరిశ్రమలు, మినీ రైస్ మిల్స్ , పౌల్ట్రీ ఫామ్స్, పైపుల తయారీ, సిమెంట్ ఇటుకల తయారీ ఇండస్ట్రీలు, మ్యాంగో, సోయా తదితర ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ ప్రొడక్ట్స్, వర్మీ కంపోస్టు యూనిట్లు వ్యవసాయ అనుబంధంగా పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే సేవా రంగంలో బ్యూటీ పార్లర్లు, బొటిక్స్, గార్మెంట్స్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.