నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
రూ. రెండు కోట్లతో ముప్కాల్ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్ వరకు చేపడుతున్న బి.టి రోడ్ డబుల్ లెన్ నిర్మాణ పనులకు, రూ.81 లక్షలతో కొత్తపల్లి నుండి ముప్కాల్ వరకు నిర్మిస్తున్న బి.టి రోడ్ పునరుద్ధరణ పనులకు, వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామం నుండి పడగల్ వరకు రూ.60లక్షలతో పంచాయతీ రాజ్ బిటి రోడ్ పునరుద్ధరణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ లేనివిధంగా వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. బాల్కొండ సెగ్మెంట్లో చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇకపై కూడా ప్రతి వారం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇవ్వని హామీలను కూడా ఆచరణలో అమలు చేసి చూపుతున్నామని అన్నారు. అభివృద్ధిలో ఎంతవరకైనా తాము పోటీ పడతామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రామాల ద్వారా లబ్ది చేకూర్చడమే ధ్యేయమని, అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్య అజెండాగా ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని, అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో స్ధానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.