నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉన్న వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇప్పించి, సర్టిఫికేట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. భీంగల్ మున్సిపల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్‌లో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన 133 మంది మహిళలకు మంత్రి వేముల ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే, వివిధ వృత్తి నైపుణ్య కోర్సులలో శిక్షణ పొందిన 700 ట్రైనీ విద్యార్థులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలు, టూల్ కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించే అవకాశం దక్కడాన్ని తానెంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. 2018 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు రెండవ పర్యాయం తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించడం, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ కీలకమైన ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రిగా బాధ్యతలు అప్పగించడం వల్లే న్యాక్ సంస్థ ఉపాధ్యక్షుడి హోదాలో స్థానికంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునే వెసులుబాటు లభించిందన్నారు.
2020-21 నుండి ఇప్పటివరకు ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, పెయింటర్, మేసన్ (మేస్త్రీ), కుట్టు మిషన్ తదితర కోర్సులలో సుమారు 700 మందికి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగిందని, అభ్యర్థులంతా వివిధ రంగాల్లో యోగ్యత సాధించారని వివరించారు. వీరిలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి స్వస్థలాలకు తిరిగివచ్చిన బాధితులు 150 మంది వరకు శిక్షణ పొందిన వారిలో ఉన్నారని తెలిపారు. న్యాక్ ద్వారా అందించే శిక్షణ, సర్టిఫికెట్లకు దేశీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉన్నందున శిక్షణ పూర్తి చేసుకున్న యువత ఉద్యోగావకాశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అభ్యర్థులు స్థానికంగా కూడా స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందిస్తే, తాము నేర్చుకున్న రంగాల్లో చక్కటి ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. నిజానికి నిర్మాణ రంగంలో హైదరాబాద్ రాజధానిలో సుమారు 20 లక్షల మంది అవసరం ఉండగా, స్థానికులు లేనందున బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఐదు లక్షల మంది నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారని మంత్రి తెలిపారు.
స్థానిక యువత వివిధ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకుంటే ఆయా కంపెనీలను సంప్రదించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్వయంగా తానే చొరవ చూపుతానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. యువత సమయం వృధా చేయకుండా తమకు నచ్చిన రంగాల్లో శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. గత 30 సంవత్సరాల క్రితం వరకు చైనా దేశపు కరెన్సీ మన భారతదేశం కరెన్సీ కంటే తక్కువ విలువ కలిగి ఉండేదని, అయితే అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని పని చేస్తుండడం వల్ల నేడు చైనా 20 రెట్లు ఎక్కువగా అభివృద్ధి సాధించగలిగిందని అన్నారు.
దీనిని గుర్తెరిగి యువత తమ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ రాజిరెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, న్యాక్ సెంటర్ ఇంచార్జి దిలీప్, ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.