నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ భారత దేశములో 18 సంవత్సారాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని, కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాలు విద్యార్ధులు అందరు వెంటనే నమోదు చేసుకోవాలని వారి నుండి ఫాం-6 లో వివరాలు సేకరించారు.
అదేవిధముగా విద్యార్థులందరూ వారి కుటుంబ సభ్యులతో ఓటర్‌గా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధముగా ఇదివరకే ఓటర్‌గా ఉన్న వారు ఫాం-6 బి లో వారి ఆధార్ నంబర్ వివరాలు జతచేసుకోవాలని, భారత ఎన్నికల సంఘం వారు ఓటర్ యొక్క ఆధార్ కార్డు వివరాలను గోప్యంగా ఉంచుతారన్నారు. అదేవిధముగా విద్యార్ధులు వారి కుటుంబ సభ్యుల పోలింగ్ బూత్ వివరాలు, ఓటర్ కార్డులో ఏమైనా సవరణలు, అడ్రెస్స్ మారితే ఆ వివరాలు అదేవిధముగా కుటుంబ సభ్యులలో ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు (పిడబ్ల్యుడి) ఓటర్‌లు ఉన్నచో ఆ వివరాలు ఫామ్ -8 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమములో పాల్గొన్న జిల్లా సహకార అధికారి, స్వీప్ నోడల్ అధికారి సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తమ సహచర విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి వారితో ఓటర్ నమోదు చేపించెలా అదేవిధముగా వారి ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానము చేసుకునేలా చేయవలసిందిగా కోరారు.
అదేవిధముగా కళాశాల ప్రతీ తరగతిలో ఇదివరకే ఏర్పాటు చేసుకున్న ఇఎల్‌ఎస్ (ఎలెక్టోరల్ లిటరసీ క్లబ్) ద్వారా ప్రతీ వారంలో ఒక రోజు ఒక గంట ఎన్నికల ప్రక్రియ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్‌ను కోరారు.
కార్యక్రమములో నిజామాబాద్, నార్త్ తహశీల్దార్ సుదర్శన్ హాజరై విద్యార్థులలో 18 సంవత్సారాలు నిండి ఓటర్‌గా నమోదు కానీ వారి దగ్గర నుండి ఫామ్ 6, ఆధార్ అనుసంధానం కాని వారి నుండి ఫామ్ -6బి సేకరించాలని కళాశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.