నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు.
ఆయా జిల్లాల వారీగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల పంపిణి, మౌలిక సదుపాయాల కల్పన, పెండిరగ్ పనుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, కలెక్టర్ లకు దిశానిర్దేశం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకానికి మొత్తం 18 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుండగా, ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 12 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న దృష్ట్యా, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, పంపిణీ ప్రక్రియలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు జిల్లా పాలనాధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా రెండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయినందున, లబ్దిదారుల ఎంపిక, పంపిణి ప్రక్రియలపై దృష్టిసారించాలని సూచించారు. ఇందులో ఇప్పటికే 33 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి, 26 వేల మందికి ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయడం జరిగిందని వివరించారు. సంబంధిత నియోజకవర్గాల శాసన సభ్యులను సంప్రదించి మిగతా 7 వేల మందికి కూడా సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.
ఇంకనూ 69 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నందున, నిబంధనలను అనుసరిస్తూ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి వేముల సూచించారు. అర్హుల గుర్తింపు, ఇళ్ల కేటాయింపు ప్రక్రియలు ఏకకాలంలో జరగాలన్నారు. 18 వేల ఇండ్లు సకల హంగులను సంతరించుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నందున, ఎంతమాత్రం తాత్సారం చేయకుండా తక్షణమే వాటిని లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.
ఇళ్ల పంపిణి పూర్తయిన వెంటనే నిర్ణీత ప్రొఫార్మా ప్రకారంగా వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తేనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం నుండి గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి ఒక్కో యూనిట్ కు 72 వేల రూపాయలు, అర్బన్ ప్రాంతం లో ఉన్న వాటికి లక్షన్నర రూపాయల చొప్పున నిధులు మంజూరవుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
45 వేల ఇండ్లకు మంజూరీ తెలిపిన సమయంలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులకు సంబంధించిన నిధులను కూడా జత చేయడం జరిగిందన్నారు. వాటిని మినహాయిస్తే, మిగతా డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుద్దీకరణ, నీటి వసతి, సెప్టిక్ ట్యాంక్, అప్రోచ్ రోడ్ వంటి పనుల కోసం 205 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, మరో 255 కోట్ల రూపాయలను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. నిధుల కొరత ఎంతమాత్రం లేదని, తుది దశలో ఉన్న నిర్మాణాలను, మౌలిక సదుపాయాలను శీఘ్రగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సంక్రాతి పండుగ నాటికి డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేసుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ప్రతి వారం ఈ పథకం అమలు తీరు, పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు.
తాను కూడా క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతానని సి.ఎస్ పేర్కొన్నారు. దేశంలోనే ఇతర ఏ రాష్ట్రాలలోనూ ఈ తరహా అన్ని వసతులతో కూడిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పంపిణీ పథకం అమలులో లేదని, నిర్దిష్ట గడువులోగా లబ్దిదారులకు వీటిని పంపిణీ చేసి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడిరపజేయాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 3682 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇప్పటికే పలుచోట్ల లబ్దిదారులకు వాటిని కేటాయించడం జరిగిందని మంత్రి దృష్టికి తెచ్చారు. తుది దశలో ఉన్న మిగతా నిర్మాణాలను సైతం పూర్తి చేసి, గడువులోపు లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పోడు భూముల పరిశీలన, గ్రామ సభల నిర్వహణ, ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, బృహత్ పల్లె ప్రక్రుతి వనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి కలెక్టర్లకు సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సునీల్ శర్మ, క్రిస్టినా జెడ్ చోంగ్తు, రవీందర్ రెడ్డి, చైతన్య, నిజామాబాద్ అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీఆర్‌డీఓ చందర్, ఆర్‌అండ్‌బీ ఎస్.ఈ రాజేశ్వర్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.