నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా తయారైందని, నగదు రహిత వైద్యం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించటం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మెడికల్ రీయంబర్స్‌మెంట్ కూడా కోతలతో నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కనీస పింఛను 9వేలు ఇచ్చేందుకు కనికరం చూపించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు పారిశ్రామిక వేత్తలకు మాత్రం కోట్లాది రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి మాత్రం చేతులు వస్తున్నాయని అన్నారు.
సామాజిక పింఛన్లు కన్నా తక్కువ పెన్షన్‌తో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు బతుకుతున్నారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు మాట్లాడుతూ సీనియర్ సిటిజనులకు ఆర్టీసీ ప్రయాణాలలో రాయితీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వేలో గతంలో ఉన్న రాయితీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా ట్రెజరీ అధికారి బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ రంగయ్యలు మాట్లాడుతూ రాజస్థాన్, చత్తీస్గడ్, పంజాబ్‌లలో పాత పింఛన్ విధానాన్ని అమలుకు పూనుకున్నాయని, తెలంగాణ ప్రభుత్వం కూడ అమలు చేయాలనీ కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు దత్తాద్రి, కార్యదర్శి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.