నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్దిష్ట గడువులోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు, తాగునీరు, విద్యుత్ వసతి, డ్రైనేజీల నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వచ్చే జనవరి 15, సంక్రాంతి పండుగ నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నెలాఖరు నాటికే అన్ని పనులను పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, వారికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని, ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో జరగాలన్నారు.
అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణాల కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న పక్షంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, మిగతా వారికి తదుపరి విడతలో అర్హులైన లబ్ధిదారులుగా పరిగణించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ సింహాచలం, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.