నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ బూత్ వద్ద బీ.ఎల్.ఓలు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు.
కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం కోసం అనుసరిస్తున్న పద్దతుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని బీ.ఎల్.ఓ లకు సూచించారు. పోలింగ్ కేంద్రాలతో పాటు ఇంటింటికి తిరుగుతూ, 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరి పేర్లను తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో చేర్చాలని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ముందుకు వచ్చేలా చైతన్యపర్చాలని హితవు పలికారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులు చేపట్టే సమయంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిర్ణీత నమూనా ఫారాలను అనుసరిస్తూ పక్కాగా ఓటరు జాబితా రూపొందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.