నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ దేశాలలోనే ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందిచే భారత సంవిధానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆధారంగానే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు, పౌరులకు ఓటు హక్కు, వాక్ స్వతంత్రం, సమానత్వపు హక్కు లభించాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటుందన్నారు. కుల, మత, లింగ, వర్ణ, వర్గ, భాషా బేధాలు లేకుండా సమన్యాయం, సమ సమాజం ఉండాలని రాజ్యాంగం బోధిస్తుందన్నారు. వీటి ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే దిశగా, బాధితులకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలోని నిబంధనకు అనుగుణంగానే పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించబడ్డాయని అదనపు కలెక్టర్ గుర్తు చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అట్టడుగున ఉన్న వర్గాలకు కూడా సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని పేర్కొన్నారు. ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కరు తమ దైనందిన కార్యకలాపాలను నిర్వర్తించాలని సూచించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ఆకళింపు చేసుకుని, తమ పిల్లలకు కూడా రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ వారు బాధ్యత గల పౌరులుగా ఎదిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.