రెంజల్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ నుండి బైంసా వరకు నిర్మించబోయే ఎన్‌హెచ్ 161 జాతీయ రహదారి ఏర్పాటులో భూములను కోల్పోయే రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ రైతులకు భరోసా కల్పించారు. ఆదివారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రైతులతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.జాతీయ రహదారి నిర్మాణంలో గ్రామానికి చెందిన 28 ఎకరాల సాగుభూమి వెళ్తుందని చెప్పారు.
పంట భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆర్డీవో మాట్లాడుతూ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వపరంగా డిసెంబర్ చివరికల్లా నష్టపరిహారాన్ని అందజేస్తామని చెప్పారు. వ్యవసాయ బోర్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రూ.670 కోట్లతో టెండర్లను పూర్తి చేసి ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్ధం రహదారిని నిర్మిస్తున్నారన్నారు. రెండు మూడు రోజుల్లో రహదారి నిర్మాణం జరిగే రైతుల భూముల వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.
సర్వే నిర్వహించి హద్దులను ఏర్పరచడం జరుగుతుందని, మిగిలిన భూముల రైతులు యాసంగి పంటలు వేసుకోవాలని ఆర్డీవో సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసిల్దార్ శశిభూషణ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, గ్రామ పెద్దలు జి.సాయారెడ్డి, నర్సయ్య, లింగారెడ్డి, హనుమంతరావు, నారాయణరెడ్డి, మధు తదితరులు ఉన్నారు.