నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ధాన్యం కొనుగోలు చేసిన నిర్ణీత వ్యవధిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డీసీఓ సింహాచలం, డీఆర్డీఓ చందర్, మెప్మా పీడీ రాములు ను ఆదేశించారు.
కాగా, శాఖాపరమైన పనులు పెండిరగ్లో ఉండకుండా, వెంటదివెంట పూర్తి చేయాలని అధికారులకు హితవు పలికారు. హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖలు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్యాలయం ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని, రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు.
పోడు భూములకు సంబంధించి డివిజనల్ స్థాయి సమావేశాలను సోమవారం సాయంత్రం నాటికే పూర్తి చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. అవసరం లేకపోయినా సిజీరియన్ కాన్పులు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక పరిశీలక బృందాలు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. శాశ్వత ప్రాతిపదికన గైనకాలజిస్టు వైద్యులను నియమించుకోకుండా సిజీరియన్ లు చేస్తున్న ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇసుక, మొరం అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, అదే సమయంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ప్రభుత్వానికి నిర్దేశిత సీనరేజ్ చెల్లించి ఇసుక, మొరం తరలించేందుకు అనుమతించాలన్నారు. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని, సెలవు దినాల్లో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ సూచించారు.