కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జలశక్తి అభియాన్‌పై పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో చేపట్టిన ఊట చెరువులు, చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోఫిట్స్ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ లకు తెలిపారు.
జిల్లాలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్, మధ్యతర ప్రాజెక్టులు పోచారం, కౌలాస్ నాల ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం వివరాలను చెప్పారు. అటవీ ప్రాంతాలలో కంటూర్ కందకాలు ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఒక ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలు, 5 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ వివరాలను చెప్పారు. బిందు సేద్యం ద్వారా కూరగాయ పంటలు, చెరకు రైతులు పండిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో 2016 నుంచి 2022 వరకు సాగు చేసిన పంటల వివరాలు హెక్టార్ల విస్తరణలో వివరించారు. సదాశివనగర్ మండలం వజ్జేపల్లిలో ఓ రైతు వర్షపు నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించి కూరగాయ పంటలు సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా భూగర్భ జలాల అధికారి సతీష్ యాదవ్, నీటిపారుదల, ఉద్యానవన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.