నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడారు.
గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 3 వేల 300 కోట్లు నిధులు విడుదల చేయక విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబిసి, మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని, గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఉప ఎన్నికల మీదున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదన్నారు. ఎక్కడో ఉన్న హర్యానా బీహార్ రాష్ట్రాల్లో ఉన్న రైతుల బాధలు కనిపిస్తున్న ముఖ్యమంత్రికి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల బాధలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ గడ్డమీద ముఖ్యమంత్రి కూతురు కవితమ్మ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కేవలం 17 నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయ భద్రత కల్పించిన ముఖ్యమంత్రికి రాష్ట్రవ్యాప్తంగా కవితమ్మ లాంటి అనేకమంది పేద బిడ్డలు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు..
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందని, సరైన వసతులు లేక, మెస్ చార్జర్‌లు పెంచక పోవడంతో పౌష్టికాహారం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిజె.శివ, రాష్ట్ర కార్యదర్శి యూసుప్ బిన్ అబూద్, కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోత రాజిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి సచిన్, తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు, షేక్ అల్తాఫ్, అవద్, మాస్, అవెస్, రాజు, శ్రీనివాస్, రవళి, సంధ్య, మమత, రజనీ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.