నిజామాబాద్, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇపుడు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే విద్యా రంగం ముందుగా అభివృద్ధి జరగాలని మాట్లాడిన పాలకులు ఎనిమిదేళ్లు గడిచినా కెజి నుంచి పిజి ఉచిత విద్య అమలుకు నోచుకోవడం లేదని అటువంటి దుస్తితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.
మూడు సంవత్సరాల నుండి 3 వేల 800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్, వార్డెన్, లెక్చరర్, మండల విద్యాశాఖ అధికారి పోస్టులను భర్తీ చేయాలని ఆయన అన్నారు.
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాల, కళాశాల భవనాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల ప్రధాన కార్యదర్శి దినేష్, ఉపాధ్యక్షుడు మధు, నాయకులు నితిన్, బాలాజీ, సుచిత్ర, సోని, కీర్తి, నికిత, రaాన్సీ తదితరులు పాల్గొన్నారు.