నిజామాబాద్, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు.
జిల్లాలో ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పాం సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు రెండు వేల ఎకరాల్లో మాత్రమే సాగుకు రైతులు సంసిద్ధత తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పంట వల్ల సమకూరే లాభాల గురించి రైతులకు పూర్తి స్థాయిలో వివరిస్తూ, వారిలో భరోసా కల్పిస్తే ఆయిల్ పాం సాగుకు జిల్లాలోని రైతులు పోటీ పడతారని కలెక్టర్ గట్టి నమ్మకాన్ని వ్యక్తపర్చారు. ఏ విధంగా చూసినా ఆయిల్ పాం సాగు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
సంప్రదాయ వరి సాగు ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.40 వేల ఆదాయం సమకూరితే, ఆయిల్ పాం పంట సాగుతో ఎకరాకు ఎంత లేదన్నా కనీసం లక్ష నుండి లక్షన్నర రూపాయల ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పైపెచ్చు ఆయిల్ పాం సాగుకు తక్కువ పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు తక్కువ ఉంటాయని, పంట సాగు చేపట్టిన మూడేళ్ల నుండి స్థిరమైన ఆదాయం చేతికందుతున్నారు. ఆయిల్ పాం తో పాటు అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చని, ఎం.ఎస్.పీ తో సంబంధం లేకుండా మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంట ఆయిల్ పాం అని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి రైతులను ఆర్థిక పరిపుష్టి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఆయిల్ పాం సాగుకు సబ్సిడీ అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.
ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలీనా 4200 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఇన్‌పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తోందని, ఒక్కో ఆయిల్ పామ్ మొక్కకు రైతులు నామమాత్రపు రుసుము చెల్లిస్తే, మొక్కకు అయ్యే మిగతా వ్యయాన్ని కూడా ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు.
ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు లోను కావాల్సిన పని లేదన్నారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంట వల్ల రైతులకు దండిగా లాభాలు సమకూరుతాయి తప్ప, ఎలాంటి నష్టం వాటిల్లదని జిల్లా పాలనాధికారి గట్టి భరోసా కల్పించారు.
ఈ అంశాలను రైతులకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ వారు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. వచ్చే సోమవారం నుండి ప్రతి మండలంలో కనీసం ఐదు మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో అవగాహన సమావేశాలు నిర్వహించి ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకు వచ్చేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు ఏపీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు విధిగా అవగాహన సమావేశాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ వారు కూడా ఆయిల్ పాం సాగుకు స్వచ్చందంగా ముందుకు వచ్చేలా చేస్తే, ఇతర ఆదర్శ రైతులు కూడా ఆయిల్ పాం సాగు చేపడతారని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవగాహన సమావేశాల సందర్భంగానే ఆయిల్ పాం సాగుకు ముందుకు వచ్చే రైతుల నుండి డీ.డీలు సేకరించాలన్నారు.
జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా చూడాలని, వారం రోజుల్లో లక్ష్య సాధన పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టమైన గడువు విధించారు. ఆయిల్ పాం సాగుకు ప్రోత్సాహం అందించే విషయంలో అలసత్వానికి ఎంతమాత్రం తావివ్వకుండా, ఒక్కో మండలం వారీగా లక్ష్య సాధనపై దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వారంరోజుల తర్వాత మళ్ళీ తాను సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. సెల్ కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.