అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీలేష్‌ వ్యాస్‌ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

గత నెల నవంబర్‌ 09 నుండి 30 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, వాటిలో ఇంకా ఎన్ని అపరిష్కృతంగా ఉన్నాయి, ఇదివరకటి జాబితాతో పోలిస్తే ప్రస్తుతం కొత్తగా పెరిగిన ఓటర్ల శాతం ఎంత, వాస్తవ జనాభా లెక్కలకు అనుగుణంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరు ఓటరుగా పేర్లను నమోదు చేసుకున్నారా, 18 – 19 సంవత్సరాలు, 20 – 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓటర్ల సంఖ్య ఎంత ఉంది, బూత్‌ లెవెల్‌ అధికారులు అందిస్తున్న సేవల గురించి, పద్దెనిమిదేళ్లు నిండిన యువత పేర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు కళాశాలల స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి తదితర అంశాలను ఆరా తీస్తూ, కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష జరుపుతూ, ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలన్నారు. అదే సమయంలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఇతర ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే, ఆ కొత్త ప్రదేశంలోని ఏదైనా పోలింగ్‌ బూత్‌ లో పేరును నమోదు చేసుకున్నారా, లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తరువాతే జాబితా నుండి పేరును తొలగించాలని తెలిపారు.

మృతి చెందిన వారి పేర్లను కూడా స్పష్టమైన నిర్ధారణ చేసుకున్న మీదట జాబితా నుండి డిలీట్‌ చేయాలని సూచించారు. 18 – 19 సంవత్సరాలు, 20 – 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓటర్ల సంఖ్యను నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2003 జనవరి 01 నుండి 2005 జనవరి 01 తేదీ మధ్యన జన్మించిన వారితో పాటు, 1993 జనవరి 01 నుండి 2023 జనవరి 01 మధ్యన జన్మించిన స్త్రీలు, పురుషుల వారీగా వేర్వేరుగా వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? స్థానికంగానే ఉంటున్నారా లేక ఏదైనా ఇతర ప్రదేశానికి వలస వెళ్ళారా అనే వివరాలను సేకరించాలని అన్నారు.

కాగా, 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన యువతను ఓటరు జాబితాలో చేర్చేందుకు వీలుగా జిల్లాలోని అన్ని కళాశాలల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీఆర్డీఓ చందర్‌, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం అధికారులు పవన్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »