కామారెడ్డి, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 3, 4 వ తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా శని, ఆది వారం రోజున నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్‌లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు గా నమోదు చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి యువతీ, యువకులను గుర్తించి గరుడ ఆప్ , ఫారం -6 ద్వారా ఓటరు గా నమోదు చేయాలని సూచించారు. బిఏల్‌ఓ లు ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించాలని ఆదేశించారు.
అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయాలని కోరారు. ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని ,ఒకవేళ లేనట్లయితే వారి పేర్లు నమోదు చేయాలని తెలిపారు.ఓటరుల జాబితాలో చిరునామాలు తప్పుగా ఉంటే సవరణ చేసుకోవాలని సూచించారు.
ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో కనీసం 10 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని చెప్పారు. ఈఆర్‌ఓ వారి పరిధిలో ఉన్న 10 పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలను పరిశీలించి అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనది లేనిది పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.