రెంజల్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్, రక్తపోటు గల రోగులకు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా మందులను పంపించడం జరుగుతుందని వీటిని ఎన్సీడీ కిట్టు బ్యాగులలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా బ్యాగులో మూడుపూటలు మందులు వేసుకునేందుకు అణువుగా ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా సులువుగా మందులను వాడుకోవడానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు.
గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రతినెల అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ వైద్యాధికారి శివప్రసాద్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.