కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయాన్ని కుల్చివేసిన అధికారులను సస్పెండ్ చేసి తిరిగి గుడిని యధావిధిగా నిర్మించాలని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి ఉమేష్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు వలిపిశెట్టి భాస్కర్ గుప్తా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడ గుడి కట్టిన ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చేది, ఎక్కడ బడి కట్టినా ఆ బడికి కావలసిన ఆర్థిక సహకారం చేసేది సమాజంలో అత్యధిక పన్నులు కట్టి సమాజాభివృద్ధికి పాటుపడేది ఆర్యవైశ్యులే అని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వైశ్యులపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇలాంటి పనులకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు.
ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ సమాజహితం కోసం పాటు పడుతున్న ఆర్యవైశ్యులను అవమానించడాన్ని కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్యులందరి తరఫున ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి విశ్వనాథుల రాజేందర్ గుప్తా, పిఆర్‌ఓ కొమురెల్లి వేణు గుప్తా, కార్యనిర్వహణ కార్యదర్శి గరిపెల్లి శ్రీధర్ గుప్తా, పంతులు కాసర్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు.