నిజామాబాద్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా జాబితా రూపొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఖలీల్‌వాడిలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌లను సందర్శించారు.
పోలింగ్ బూత్ వద్ద బీ.ఎల్. ఓ లు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం కోసం అనుసరిస్తున్న పద్దతుల గురించి వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ ఒక్క ఓటరు పేరు సైతం తప్పిపోకుండా అర్హులందరిని జాబితాలో చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఇతర ప్రదేశాలకు వలస వెళ్లిన ఓటర్లను గరుడ యాప్ సహాయంతో ఫోన్ ద్వారా సంప్రదించాలని అన్నారు.
వలస వెళ్లిన వారు కొత్త ప్రదేశంలో ఓటరుగా పేరు నమోదు చేసుకుంటే, ఆ వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేసిన తరువాతే స్థానిక ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకే పరిమితం కాకుండా ఇంటింటికి తిరుగుతూ, 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరి పేర్లను తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో చేర్చాలని, కళాశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు చేయడానికి వచ్చిన దరఖాస్తుల్లో నమూనా ఫారాలను అనుసరిస్తూ పక్కాగా ఓటరు జాబితా రూపొందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు కల్పించినా, ఎన్నికల సంఘం చేపట్టే చర్యలకు బాధ్యులవుతారని అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.