నిజామాబాద్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఉద్బోధించారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, కలెక్టర్ సి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్యారంగంతో పాటు క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని సామాన్యులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారని, పైపెచ్చు కొంతమంది మరింత ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ, మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తద్వారా అనేక అద్భుతాలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు.
శారీరక లోపం విజయ సాధనకు ఎంతమాత్రం అడ్డంకి కాదని, ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మల్చుకోవాలని పిలుపునిచ్చారు. గుండెనిండా ధైర్యం కలిగి ఉంటే ఎంతటి కష్టాన్నైనా అలవోకగా ఎదుర్కోవచ్చని అన్నారు. అనేక రంగాల్లో దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత దక్కేలా కృషి చేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. వచ్చే నెల జనవరిలో పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన దివ్యాంగులకు వారి కోటాను అనుసరిస్తూ తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దళిత బంధు పథకంలోనూ దివ్యాంగులకు కోటాను అమలయ్యేలా చూస్తామన్నారు.
ఆయా శాఖల్లో ఖాళీల భర్తీ కోసం చేపట్టే ఉద్యోగ నియామకాల్లోనూ దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టత లభించిందని తెలిపారు. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లలో ఇప్పటికే దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఏ విషయంలోనూ దివ్యాంగులు ఎంత మాత్రం అధైర్య పడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం వారికి వెన్నుదన్నుగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు బహూకరించారు.
చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలపించిన గేయాలు ఆహుతులను అలరింపజేశాయి. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, డీఆర్డీఓ చందర్, డీడబ్ల్యూఓ సుధారాణి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.