ఆర్మూర్, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్పెట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అగ్గి మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నోముల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచి పూలతో అలంకరించిన రథాన్ని (సిడి) ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ మూడుసార్లు రథాన్ని తిప్పారు.
అగ్నిగుండం వద్ద విడిసి సభ్యులు పూజలు చేసి అగ్నిని వెలిగించారు. జాతరలో గ్రామస్తులతోపాటు పక్కనున్న వేల్పూర్ మండలం జానకంపేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేశారు. మహిళలు కుటుంబ సభ్యులతో పాటు మల్లన్న దేవునికి బోనాలు తీసుకొచ్చి నైవేద్యాలను సమర్పించారు.
మహిళలు పూలతో తయారుచేసిన ఉయ్యాలలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నోముల నవీన్ రెడ్డి, సభ్యులు ఎర్రం సురేష్, అంతిరెడ్డి భూపతిరెడ్డి, దొన్పాల్ రాజేశ్వర్, మాదం సాయిలు, సాయగౌడ్, రాజు, యాల్ల గంగారెడ్డి, కొపేల్ల గంగారాం, ఉపసర్పంచ్ బండమీది గంగాధర్, సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, ఎంపిటిసి సభ్యుడు యాల్ల రాజ్ కుమార్, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.