నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం, నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రోగ్రాం ఉద్దేశం వల్ల రైతులకు అవగాహన కలుగుతుందని, విపరీతమైన ఎరువులు, పురుగు మందులు, ఇతర రసాయన ఉత్పాదకాల వాడకంతో నేల స్వభావమే మారిపోతుందని, రైతు సోదరులందరూ ఆర్గానిక్ సేంద్రియ ఎరువు పద్ధతిని రైతులందరూ అవలంబించి ప్రజల ఆరోగ్యాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
రైతులందరూ సేంద్రీయ వ్యవసాయాన్ని చెయ్యాలని ఆయన రైతులకు వివరించారు. నేలపై మంచి మార్పు, చెడ్డ మార్పు చాల నెమ్మదిగా వస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత మనమీదే ఉందని గోవర్ధన్ స్పష్టం చేశారు. రైతులందరూ వరి పంటనే కాకుండా చిరుధాన్యాలు, కూరగాయలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రైతులకు ఆయిల్ ఫామ్ విత్తనాలను అందిస్తున్నామని, దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల వరి కంటే అధిక దిగుబడులు వచ్చి రైతులు ఆర్థికంగా ఇదగవచ్చని అన్నారు. ఆయిల్ ఫామ్ పంట గురించి సందేహాలు సూచనలు కావాలంటే వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక జడ్పిటిసి దాసరి ఇందిర లక్ష్మీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనారాయణ రెడ్డి , సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, స్థానిక సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.