రెంజల్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దండిగుట్ట గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక పాఠశాల పాత బిల్డింగ్‌ను మరమ్మత్తులు నిర్వహించి అంగన్వాడీ కేంద్రానికి అందజేయడంతో సోమవారం అంగన్వాడీ భవనాన్ని ఎంపీడీవో శంకర్, సర్పంచ్ ముళ్ళపూడి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీదేవి కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ నిరుపయోగంగా ఉండడంతో దానికి మరమ్మతులు చేయించి అంగన్వాడీ కేంద్రానికి అందివ్వడం గర్వకారణం అని ఎంపీడీవో శంకర్ అన్నారు.
గ్రామస్తుల సహకారంతో అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు సురక్షితంగా ఉండేందుకు భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీలారాణి, పంచాయతీ కార్యదర్శి గౌతమి, కిష్టయ్య, అంగన్వాడి ఉపాధ్యాయురాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.