కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్‌టవర్ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు ‘డాడీ..డాడీ.. దిగండి డాడీ’ అని కన్నీరు మున్నీరయినా.. తన నిర్ణయం మార్చుకోలేదు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని గత నాలుగేళ్లుగా అధికారులు, గ్రామస్థులకు మొర పెట్టుకున్నాడు. దీంతో రెండు సంవత్సరాల క్రితం అప్పటి తహసీల్దార్ అమీన్‌సింగ్ ఆయన భూమికి వెలకట్టి పరిహారం కింద రూ. 2 వేలు చెల్లించాడు.
గత ఏడాది గ్రామ రైతులెవరూ చెరువు కింద పంటలు సాగు చేయలేదు. కానీ, ఆదివారం రైతులు చెరువు సమీపంలో పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో తన భూమి మీదుగా మళ్లీ పంట నీరు వెళ్తుందన్న మనస్తాపంతో ఆంజనేయులు సోమవారం సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఎస్సై శంకర్, తహసీల్దార్ మారుతితో చరవాణిలో మాట్లాడాడు. వారు ఎంత సర్దిచెప్పినా ఒప్పుకోలేదు. ఎస్పీ, డీఎస్పీ ఇక్కడికి రావాలని పట్టుబట్టాడు.
సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినకుండా.. తువ్వాలుతో సెల్‌ఫోన్ టవర్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీవో శ్రీను నాయక్, డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.