నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 నుంచి 12 గంటలకు మించి రైతాంగానికి విద్యుత్తు సప్లయి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనితో రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతాంగానికి 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని, రైతులకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు దొంగలు తొలగించడం వలన రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, కనుక వెంటనే వాటి స్థానాల్లో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు అందించి రైతులను ఆదుకోవాలని, విద్యుత్తు పరికరాలు కూడా డబ్బులు లేకుండా రైతులకు అందించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు ఆది నరేందర్, రైతులు పాల్గొన్నారు.