కామారెడ్డి, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలి ముర్తుజా రిజ్వితో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని, రెండవ విడత కార్యక్రమం 2023 జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో గ్రామాలు,మున్సిపల్ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్‌ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో ఉన్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మేర బృందాలను సన్నద్దం చేసుకోవాలని, గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి టీమ్‌లో ఒక డాక్టర్, అప్తోమెట్రిస్ట్, 3 ఆశాలు, 2 ఏ.ఎన్.ఎం.లు, 1 డాటా ఎంట్రీ ఆపరేటర్, 2 సిహెచ్‌ఓలు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో బృందాలకు వసతి సౌకర్యం ఏర్పాట్లను కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు గ్రామాల్లో, వార్డుల్లో శిబిరాలు ప్రారంభించాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, రీడిరగ్ కళ్ళద్దాలను జిల్లాలకు పంపుతామని, వాటిని పి.హెచ్.సి ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. పరీక్షల అనంతరం రీడిరగ్ కళ్ళద్దాలు అదే రోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్ళద్దాలు నెల రోజుల్లో ప్రజలకు అందజేస్తామని మంత్రి అన్నారు. డిస్టెన్స్, స్పెసిఫిక్ కళ్ళద్దాలపై బార్ కోడ్ ఏర్పాటు చేసి, సదరు వ్యక్తులకు ఆశాల ద్వారా అందజేయాలని సూచించారు.
జిల్లాలో ఆఫ్తామాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తి చేసి, జాబితా అందజేస్తే సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్.బీ ప్రసాద్ ల్యాబ్‌లో శిక్షణ అందజేయడం జరుగుతుందని, వైద్య బృందాలకు అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం సైతం చేపట్టి, వారికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని మంత్రి సూచించారు. కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా 959 డాక్టర్ల నియామకం వారంలో పూర్తవుతుందని, వీరికి అదనంగా ఆర్.బి.ఎస్.కె వైద్యులను, ఆయూష్ వైద్యులను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
కంటి వెలుగు శిబిరాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. గ్రామాల్లో, వార్డులో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్, మైక్రో ప్లానింగ్ పూర్తి చేసిన తరువాత, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల, అధికారులతో జిల్లా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని మంత్రి హరిష్ రావు ఆదేశించారు.
జిల్లాలో 5 శాతం అదనంగా కంటి వెలుగు బృందాలను సిద్దం చేసుకోవాలని, అవసరమైన సమయంలో ప్రత్యామ్నాయ బృందాలు సిద్దం కావాలని అన్నారు. ప్రతి జిల్లాలో కంటి వెలుగు శిబిరాల పనితీరు పర్యవేక్షించేందుకు నాణ్యత ప్రమాణాల టీం లను ఏర్పాటు చేస్తామని అన్నారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, అర్బన్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు గుర్తించాలని, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మందికి స్క్రీన్ చేయాలనే లక్ష్యం ఏర్పర్చుకున్నామని, ప్రపంచంలో అతి పెద్ద కమ్యూనిటీ స్క్రినింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు సాధించాలని మంత్రి తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం 200 కోట్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. కంటి వెలుగు శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబులను అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మండల, జిల్లా పురపాలక సంఘ మీటింగ్‌లో కంటి వెలుగుపై చర్చించి ప్రజాప్రతినిధులకు సందేహాలను నివృత్తి చేయాలని, జిల్లాలో విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు ఏ రోజు ఏ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న లిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారులి జిల్లాలో ఉన్న జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు 44 బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్ కమిషనర్లు, వైద్య అధికారుల సమన్వయంతో షెడ్యూల్ తయారు చేస్తామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సూచనలు పాటిస్తూ జిల్లాలో విజయవంతంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
వీడియో సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ లు జగ్జీవన్, రమేష్ కుమార్, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.