కామారెడ్డి, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మన ఊరు మనబడి ప్రణాళిక అభివృద్ధి పనుల ప్రగతిని వివరిస్తూ జిల్లాలో మొదటి విడతగా మండలానికి రెండు చొప్పున 44 పాఠశాలలు మోడల్‌గా చేపట్టి పనులు చేస్తున్నట్లు తెలిపారు. శరవేగంగా పనులు జరుగుతున్న 6 పాఠశాలలలో రెండు పాఠశాలలో పూర్తి చేయడం జరిగిందని, మరో4 పాఠశాలలు 90 శాతం పనులు పూర్తయ్యాయనీ వివరించారు. నిర్దేశించిన పనులు నిర్ణీత వ్యవధిలోగా డిసెంబర్ చివరి వారంలోగా పూర్తి చేస్తామని అన్నారు.మన ఊరు మన బడి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి పాఠశాలను తప్పనిసరిగా పర్యవేక్షిస్తామన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచన నుంచి వచ్చిన ప్రతిష్టాత్మకమైన మన ఊరు మనబడి కార్యక్రమం అన్నారు. నిధులకు కొరత లేదని ,పాఠశాలలలో నాణ్యత మైన పనులు చేపట్టి క్రీడా ప్రాంగణం తో పాటు పాఠశాలను అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఉండి తీరాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామపంచాయతీ బాధ్యత తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పనులు పూర్తయిన వాటి బిల్లులు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జితేష్ వి పాటిల్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, కోఆర్డినేటర్ శ్రీపతి, గంగా కిషన్, మండల నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.