కామారెడ్డి, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట్ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి సాన్విక కు (07) ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరమని వారి బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు 69 వ సారి సకాలంలో రక్తాన్ని అందించారు.
ఈ సందర్భంగా రక్తదాత డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను విడనాడాలని, రక్తదానం వల్ల రక్తదాతలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతమైన వ్యక్తులు ప్రతి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్ లేట్ల ను అందజేయవచ్చును అన్నారు.
ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సాయం అందజేయడం, పేదింటి ఆడపడుచుల వివాహాల కోసం పుస్తె మట్టలను అందజేయడం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అదేవిధంగా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సకాలంలో రక్తాన్ని అందజేస్తామని అన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహకారంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మోహన్ మరియు సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ బ్లడ్ సిబ్బంది సతీష్, రమేష్, వెంకటేష్ పాల్గొన్నారు.