నిజామాబాద్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ వసతుల కల్పనకై పాత కలెక్టరేట్‌తో పాటు దాని పరిసరాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశాల్లో అతి త్వరలోనే అధునాతన హంగులతో వెజ్-నాన్ వెజ్ సమీకృత మార్కెట్ భవన సముదాయం, ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం తదితర నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ స్థలాలను నూటికి నూరు శాతం ప్రజోపయోగ అవసరాల కోసమే వినియోగించనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలకు ఈ స్థలాలను కట్టబెడతారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని, ప్రతి అంగుళం స్థలాన్ని కూడా ప్రజల అవసరాల కోసమే వినియోగిస్తామని జిల్లా పాలనాధికారి పేర్కొన్నారు. కూల్చివేతల్లో ఏ ఒక్క ప్రైవేట్ వ్యక్తి ప్రమేయం లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతోందని, నగర ప్రజలకు నడిబొడ్డున అన్ని సదుపాయాలు చేరువ చేసేందుకే ఈ పనులు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు.
ఇటీవల నిజామాబాద్ నగర ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిర్వహించిన సమీక్ష సందర్భంగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. అనవసర అపోహలను నమ్మవద్దని, నగర ప్రగతికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.