నిజామాబాద్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
పెండిరగులో ఉన్న పనులను పది రోజుల్లోపు పూర్తి చేసి అర్బన్ పార్క్ ను ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని ఆదేశించారు. కనీస సదుపాయాలైన నీటి వసతి, విద్యుత్ సరఫరా, టాయిలెట్లు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలన్నారు. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నుండి అర్బన్ పార్కుకు కనెక్షన్ అందించే పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు నాణ్యతతో జరుగుతున్నాయని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే తుది దశ పనుల్లో జాప్యానికి తావులేకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసేలా చొరవ చూపాలని అన్నారు. నిధుల కొరత ఎంతమాత్రం లేదని, అదనంగా మరో ఐదు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేయనుందని తెలిపారు. పిల్లలకు ఆటవిడుపు కోసం ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏరియాతో పాటు, ప్రధాన ప్రవేశ మార్గానికి ఇరువైపులా పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్‌డీఓ భవాని శంకర్, తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ క్రాంతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారులు సౌమ్య, అశోక్ కుమార్, స్థానిక సర్పంచ్ లక్మి తదితరులు ఉన్నారు.