నిజామాబాద్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేనలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మన ఊరు – మన బడి పనులపై సమీక్ష జరిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలను ఎంపిక చేయగా, అందులో 96 శాతం బడులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 30 లక్షల పైచిలుకు విలువ కలిగిన పనులు చేపట్టాల్సి ఉన్న 257 బడులను మినహాయిస్తే మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 300 బడులలో సివిల్ వర్క్స్ అన్ని పూర్తయ్యి, పెయింటింగ్ కూడా పూర్తి చేసుకోగలిగామని, కలెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగం, విద్యా శాఖ అధికారుల ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
మరో 400 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇదే తరహాలో మిగితా మంజూరీ తెలిపిన అన్ని పాఠశాలల్లోనూ త్వరితగతిన పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి నిధుల కొరత ఎంతమాత్రం లేదని, పనులు చేపట్టిన వెంటనే నిధులను విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు. వారం క్రితమే రూ. 100 కోట్లు విడుదల చేశామని, గురువారం ఒక్క రోజులోనే ఎఫ్.టీ.ఓ లు జెనరేట్ అయిన వాటికి సంబంధించి రూ. 40 కోట్లు డ్రా అయ్యాయని తెలిపారు.
నిధులు అందుబాటులో ఉన్నందున పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో పనులన్నీ సంపూర్ణంగా జరిగేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి మొత్తం 9 వేల 123 పాఠశాలల్లోనూ పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ జరపాలని, పనుల్లో నాణ్యతా లోపాలకు తావు ఉండకూడదని సూచించారు.
30 లక్షల పైచిలుకు విలువ కలిగిన పనులను కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రౌండిరగ్ జరిగేలా కృషి చేయాలన్నారు. బ్లాక్ బోర్డుల స్థానంలో గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయడం, డ్యూయల్ డెస్క్ లు, నేమ్ బోర్డ్స్ వంటి వాటి పైనా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఐదు వేల ప్రాథమిక పాఠశాలలకు లైబ్రరీలను మంజూరు చేస్తూ, పుస్తకాలు, సామాగ్రిని సమకూర్చనున్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా లైబ్రరీల కోసం అవసరమైన గదులను ఎంపిక చేయాలని, డిసెంబర్ నెలాఖరు నాటికి ఎంపిక చేసిన బడులలో లైబ్రరీలు ప్రారంభం కావాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, మొదటి విడతగా జిల్లాలో మంజూరీ తెలిపిన మొత్తం114 పాఠశాలల్లోనూ గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే సివిల్ పనులు పూర్తయిన బడులలో ఎనిమిది బృందాలచే పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారుల బృందాలచే బడులను సందర్శింపజేసి పకడ్బందీ పర్యవేక్షణ చేయిస్తున్నామని అన్నారు.
మండల లైబ్రరీల ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లాలో అవసరమైన గదులను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచామన్నారు. 30 లక్షల రూపాయల పైచిలుకు విలువ కలిగిన పనులు చేపట్టేందుకు ఏజెన్సీలు ముందుకు రానందున, పాఠశాల యాజమాన్య కమిటీలచే ఈ పనులు జరిపించేందుకు అనుమతించే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ కోరారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యా శాఖ సెక్టోరల్ అధికారి నర్రా రామారావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు భావన్నా, దేవిదాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.