ఎల్లారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాలా కాలం నుంచి ఉన్న ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరినా స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్‌కు పట్టింపు లేదా వెంటనే రాజీనామా చేయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు.
ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అవస్థలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో తిరుగుతూ మూత్రశాలలు, పెచ్చులూడిపోతున్న బస్టాండ్ పైకప్పును పరిశీలించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో గెలిచి కోట్ల రూపాయలకు టిఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యే సురేందర్‌కి ఎల్లారెడ్డి కేంద్రంలో ఉన్న బస్టాండ్ పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సాక్షాత్తుగా తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌ని తీసుకువచ్చి బస్టాండ్ పరిశీలించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు శిథిలావస్థలో ఉన్న బస్టాండ్‌ను కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా బస్టాండ్‌లో కనీస మౌలిక సౌకర్యాలు లేక మూత్రశాలలు లేక మహిళా కండక్టర్లు మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే సురేందర్‌కు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. అదేవిధంగా ఈ నెల రోజుల్లో నూతన బస్టాండ్ పనులను ప్రారంభించాలని లేనిచో నియోజకవర్గ ప్రజలందరినీ ఏకం చేసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అన్ని మండలాల ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.