నిజామాబాద్, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కంటి వెలుగు, మన ఊరు – మన బడి, హరిత హారం, తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, కొత్త ఓటర్ల వివరాల నమోదు, ధరణి తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. జిల్లా, డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసుకుని, 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాము పంపించే జనాభా వివరాల ఆధారంగా పీహెచ్‌సీలు, యూ.పీ.హెచ్.సీల వారీగా సమగ్ర ప్రణాళికను రూపొందించాలన్నారు.
కంటివెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం మధ్యలో నిలిచిపోకుండా గడువులోపు నూటికి నూరు శాతం పూర్తి చేసేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న పనులను వేగవంతం చేస్తూ ఈ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తయ్యేలా నిరంతరంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 114 పాఠశాలల్లో అన్ని సివిల్ వర్క్స్, పెయింటింగ్ తో పాటుగా ఉపాధి హామీ కింద మంజూరీ తెలిపిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. 30 లక్షల పైబడి విలువ కలిగిన పనులను సైతం గ్రౌండిరగ్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని హితవు పలికారు.
మన ఊరు – మన బడి కార్యక్రమానికి నిధులు అందుబాటులో ఉన్నందున, పనులు పూర్తయిన వెంటనే ఎఫ్.టీ.పీలు జెనరేట్ అయ్యేలా చూడాలన్నారు. ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలలను సందర్శించి నిర్దిష్ట గడువులోపు నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల పేరు, రెయిలింగ్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ తో ఏర్పాటు చేయించాలని, బడి ఆవరణలో అందమైన మొక్కలు, లాన్ తో కూడిన పచ్చదనం ఉండేలా ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు.
పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నందున ప్రభుత్వ బదులు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మారాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చిన్నచిన్న కారణాల వల్ల పనుల్లో జాప్యం నెలకొనకుండా సమస్యలను వెంటదివెంట పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు.
కాగా, హరితహారం నిర్వహణపై నిరంతరం దృష్టిని కేంద్రీకరించి ఉంచాలని, అన్ని రోడ్లకు ఇరువైపులా ఏపుగా మొక్కలు ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మొక్కలకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటులో అలసత్వం వీడాలని సూచించారు.
క్రీడా ప్రాంగణాలు ఏర్పాటులో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వారం రోజుల వ్యవధిలో స్థల కేటాయింపు జరిగిన 393 ప్రదేశాల్లోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ ఒక్కటి పెండిరగ్లో ఉన్న ఉపేక్షించబోమని, నామ్ కె వాస్తేగా పని చేస్తే సస్పెన్షన్ వేటు వేస్తామని తేల్చి చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీల్లో సగటున 12 వేల చొప్పున మొక్కలు పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇదిలాఉండగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల తుది దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా నీటి వసతి సమకూర్చాలని, విద్యుత్, అప్రోచ్ రోడ్ వంటి సదుపాయాల కల్పన పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూంల కోసం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత నమూనాలో తమకు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో ఆయా వర్గాలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నారు. ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన అన్ని దరఖాస్తులను తక్షణమే ఆన్ లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా 98 శాతం ఆధార్ సీడిరగ్ జరగాలని, ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన పక్కాగా జరగాలని కలెక్టర్ సూచించారు. ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి సమాచారాన్ని వెంటదివెంట పంపాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్, ఆయా శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.