కామారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లైసెన్సు లేకుండా తినుబండారాలు (ఆహార పదార్థాలు) విక్రయాలు చేస్తే రూపాయలు ఐదు లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్సులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
లైసెన్సు పొందిన వ్యాపారులు నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించాలని సూచించారు. కల్తీ లేకుండా వ్యాపారులు తినుబండారాలు తయారుచేసి విక్రయించాలని కోరారు. ఏడాదికి ఒకసారి లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత, అధికారులు పాల్గొన్నారు.