కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడారు.
గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ బకాయిలు దాదాపు 3 వేల 300 కోట్లు నిధులు విడుదల చేయక పోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటర్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే గద్దె దింపుతారు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, ఈబిసి మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని, గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఉప ఎన్నికల మీదున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని అన్నారు. ఎక్కడో ఉన్న హర్యానా బీహార్ రాష్ట్రాల్లో ఉన్న రైతుల బాధలు కనిపిస్తున్న ముఖ్యమంత్రికి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల బాధలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందని, సరైన వసతులు లేక, మెస్ చార్జీలు పెంచక పోవడంతో పౌష్టికాహారం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో టీజేఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.జె.శివ, మనోహర్ పటేల్, రాష్ట్ర కార్యదర్శులు యూసుప్ బిన్ అబూద్, సవీంద్ర చౌహన్, పటోళ్ల మహిపాల్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతె రాజిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి సచిన్, అంజల్ రెడ్డి, అవద్, మాస్, అవెస్, రాజు, శ్రీనివాస్, రవళి, సంధ్య, మమత, రజనీ పెద్ద సంఖ్యలో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.